ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాదాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విశాఖ నోవాటెల్ లో జరిగిన సీఐఐ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాల (MOUs) సంతకాల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సహచర మంత్రులు పి. నారాయణ, టీజీ భరత్, సీఎస్ విజయానంద్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జెడ్. శివప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్ల పెట్టుబడుల కోసం మూడు సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని మారిటైమ్ రంగంలో దాదాపు 1300 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.






