ఎవరైనా సరే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ భూముల ఆక్రమణదారులపై. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారిని ఉపేక్షించ వద్దని అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూముల ఆక్రమణలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం గురించి ముఖ్యమంత్రి, సహచర మంత్రుల వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లా,ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పరిశీలించారు.
అడవిలో వేసిన కంచె, సరిహద్దులను విహంగ వీక్షణం ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు, శాఖ ఆస్తులు పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు.
మంగళంపేట అటవీ భూముల అంశాన్ని వివరించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పి.ఓ.ఆర్.), ఛార్జ్ షీట్ దాఖలు చేశామని తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామన్నారు. పి.ఓ.ఆర్., విజిలెన్స్ నివేదిక వివరాలపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలి. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి లాంటి వివరాలు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.






