ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు లో భాగంగా అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి శ్రీ గాన్ సో హాంగ్ ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రసంగించారు మంత్రి నారా లోకేష్. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్సాఫార్మేషన్ కు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రోజు రోజుకు టెక్నాలజీ మారుతోందని, దీనిని సద్వినియోగం చేసుకోగలిగితే సమయంతో పాటు మానవ వనరుల వినియోగం తగ్గుతుందన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు నారా లోకేష్. సింగపూర్ సర్కార్ తో తాము ఒప్పందం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేశారు .






