ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వీరి నిర్వాకం కారణంగా రైతులకు శాపంగా మారిందన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కనీసం పరామర్శించక పోవడం, కనీస మద్దతు ధర చెల్లించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు రావాలన్నారు.దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రాష్ట్ర రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.
అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపి వేసిన సీసీఐ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదని, మిగిలిన పంటను కూడా అమ్ము కోలేక నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం ఇప్పటి వరకు ఢిల్లీకి 60 సార్లు వెళ్లినా పత్తి రైతుల విషయం పరిష్కరించడంలో దృష్టి సారించ లేదని మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలా చేయడం తగదని హితవు పలికారు. తక్షణమే కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.






