సీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
హైదరాబాద్ : తమను కావాలని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము కూడా ఈ దేశ పౌరులమేనని, తమకు కూడా వాక్ స్వతంత్రం ఉంటుందని, ప్రాథమక హక్కులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. నానా దుర్భాష లాడుతున్నారని, అడ్డమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన చెందారు మహిళా జర్నలిస్టులు. ట్రోలింగ్ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.
విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిల్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, ఐపీసీ, ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆన్లైన్–భౌతిక రక్షణను కల్పించాలని విన్నవించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని చెప్పారు . హైదరాబాద్ సిటీ పోలీసులు సమర్పించిన సమాచారాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.






