నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ‘అన్నదాత దుఃఖీభవ’ చేశారని వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 20 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారంటూ మండిపడ్డారు. ఆ రోజే కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేదు అన్నారని, కానీ ఇప్పుడు గెలిచాక కేంద్రం ఇచ్చే PM కిసాన్‌తో లింక్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు . రాష్ట్రంలో 80 లక్షలకు పైగా రైతులు ఉంటే, కేవలం 46 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన చెందారు షర్మిలా రెడ్డి. మొన్నటి తుఫాన్ దెబ్బకు రైతులు స్వరం కోల్పోయారని, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, దాన్ని 4 లక్షలకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.
CII సమ్మిట్ పేరుతో చంద్రబాబు కొడుతున్నది డబ్బా. విజన్ లేదు, పట్టుదల అంతకన్నా లేదంటూ ఎద్దేవా చేశారు. 17 నెలల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెప్తున్నది అంతా హంగామా. 11 ఏళ్లుగా చెవుల్లో పూలు కాదు, ఏకంగా కాలీఫ్లవర్లు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు , జగన్ ఇద్దరూ పెట్టుబడుల పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. గత 11 ఏళ్లుగా జరిగిన MOUలు నాలుక గీసుకోడానికి కూడా పనికి రావన్నారు.. చంద్రబాబు 2014–19లో మూడు సమ్మిట్‌లు పెట్టారు, వాటిలో 1761 MOUలు కుదుర్చు కున్నామని, 19 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కానీ ఆ సమయంలో కనీసం 10 శాతం అయినా MOUలు గ్రౌండ్ అయ్యాయా అని ప్రశ్నించారు. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ హయాంలో MOUల పేరుతో చేసింది మోసమేనని మండిపడ్డారు షర్మిలా రెడ్డి. 2023లో విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్ పెట్టి, 387 MOUలు చేసుకున్నామని, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారు. మొత్తం జగన్ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఊదర గొట్టారని. అయితే 5 ఏళ్లలో చేసుకున్న MOUల్లో 10 శాతం కూడా అమలులోకి రాలేదన్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు MOUలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేశారు తప్ప నిరుద్యోగులను ఆదుకున్నది లేదన్నారు. నాటి ఇద్దరి MOUలకు నిజంగా ఉద్యోగాలు వచ్చి ఉంటే, ఏపీలో నిరుద్యోగులు అనేవారు ఉండేవారు కాదన్నారు. ఇప్పటికీ ఉద్యోగాలు లేక మన రాష్ట్ర యువత బయట రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు.





