రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు . బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇప్పటికే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు.
పరిశుద్ధమైన తాగు నీటిని అందించాలన్న ఉద్దేశంతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి ఎస్ సవిత. ఇందు కోసం రూ.20.29 కోట్లు మంజూరు చేశామన్నారు. వాటిలో 922 బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.16.85 కోట్లు విడుదల చేశామన్నారు. 109 ఎంజేపీ గురుకులాలకు గానూ 54 గురుకులాల్లో ఇప్పటికే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 55 గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల కోసం రూ.3.44 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆయా గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ రాబోయే 45 రోజుల్లో పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మాధవీలతను ఆదేశించినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు.





