22,23వ తేదీలలో ముఖ్యమంత్రి టూర్
అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎస్ విజయానంద్. 22 తేదీ శనివారం ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళతారు సీఎం. 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలుకుతారు. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ముర్ము పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలుకుతారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరం 3.50 గంటలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతితో కలిసి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు నారా చంద్రబాబు నాయుడు. 23 తేదీ ఆదివారం 9 గంటలకు శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయల్దేరి మద్యాహ్నం 1 గంటకు ఉండవల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి తిరిగి చేరుకుంటారని సీఎస్ వెల్లడించారు.





