స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ : ఈ దేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నాబార్డ్ ను ఈ సందర్బంగా ప్రశంసించారు. హైదరాబాద్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఎర్త్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతులను ప్రోత్సహిస్తున్నప్పటికీ మరింతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా రుణాలు ఇచ్చేటప్పుడు సబ్సిడీ కూడా ఎక్కువగా ఇచ్చినట్లయితే మరింత సాగు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేందుకు వీలు కుదురుతుందన్నారు భట్టి విక్రమార్క.
మన రైతులు, మన నేల, మన గ్రామీణ సమాజాలు భారతదేశ బలానికి గుండెకాయగా నిలిచాయని చెప్పారు. బలమైన సంస్థలు నిజమైన వ్యవసాయ పరివర్తనకు దారితీస్తాయనితాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు డిప్యూటీ సీఎం. ఆ ప్రయాణంలో నాబార్డ్ అత్యంత ప్రభావవంతమైన భాగస్వాములలో ఒకటిగా ఉందన్నారు. తెలంగాణలో రుణమాఫీలు, పారదర్శక సేకరణ, డిజిటల్ పంట వ్యవస్థలు, గ్రామీణ కనెక్టివిటీ మరియు వాతావరణ-స్మార్ట్ వ్యవసాయంతో రైతులను శక్తివంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు . ఆధునిక, సాంకేతికత ఆధారిత, స్థితిస్థాపక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి నాబార్డ్ తో కలిసి పని చేస్తామన్నారు.





