సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టీపీ (HILTP) స్కీం కాదన్నారు. అది వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ (Multi-Use) విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించ బడిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం పాలసీ కాదు. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని అన్నారు.
బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు . ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30%కే అప్పగించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుండి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం 30% కే చేయాలని చూస్తోంది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని ప్రశ్నించారు. మార్కెట్ ధరలు, ఎస్ఆర్ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వాదించారు. కనీసం ఎస్ఆర్ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదని. కేవలం 30% మాత్రమే తీసుకుంటున్నారని , మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. చాలా సందర్భాల్లో ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు అనేక రైతులతో ఇచ్చిన ఈ భూములను ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదన్నారు.





