ప్రకటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ ప్రాథమిక వ్యవసాయ రంగంలోని వ్యవసాయం , ఆక్వా కల్చర్ ,ఉద్యాన ,పట్టు శాఖలలో, పశు పోషణ , పాల ఉత్పత్తి , మాంసం ఉత్పత్తిలో ప్రగతి చూపటంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ విషయములో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రు.310 కోట్ల మేర అందించడం జరిగిందన్నారు . మోoత (Montha) తుఫానుకు నష్ట పోయిన 3.26 లక్షల మంది రైతులకు రు.390 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించ బోతున్నాం అని ప్రకటించారు.
పంటల భీమా విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన , వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ, మామిడి పంటను కూడా మొదటిసారిగా భీమా పరిధిలోకి తేవటం జరిగిందని తెలిపారు . భీమా పొందడానికి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా నమోదు చేయటానికి , దిగుబడుల వివరాలను తెలుసు కునేందుకు శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పారు కింజరాపు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి రు.15,955/- కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ,కేవలం 24 నుండి 48 గంటలలోపు చెల్లించామని తెలిపారు . వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధరల వ్యత్యాసం ఏర్పడినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సరైన మద్దతు ఇవ్వడం , రైతు బజార్లు , మార్కెట్ సౌకర్యాలను విస్తృత పరచటం చేయడం జరిగిందని తెలిపారు.





