ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు. తూముకుంట మున్సిపాలిటీ, శేరిలింగంపల్లి మండలంలోని పలు వాగులు, చెరువులను పరిశీలించారు. తూముకుంట మున్సిపాలిటీ లోని దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అదే మార్గంలో కొత్తగా కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తున్న క్రమంలో రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానిక మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవరాయాంజాల్ విలేజ్లోని వరద కాలువ ఆక్రమణలను పరిశీలించారు.
నల్లగండ్ల పెద్ద చెరువుకు వచ్చే వరద కాలువ కబ్జా అవ్వడంతో పాటు చెరువునుంచి బయటకు వెళ్ళే నీటి దారులను కూడా మార్చారని వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. నల్లగండ్ల చెరువును అభివృద్ధి చేసే క్రమంలో అపర్ణ నిర్మాణ సంస్థ అలుగులు మార్చారని, చెరువులోని బండ్ నిర్మించారని ఫిర్యాదులపై కూడా స్థానికులతో విచారించారు. అనంతరం గోపన్నపల్లిలోని చిన్న పెద్ద చెరువు కబ్జాలు కూడా పరిశీలించారు. ఇలా అన్ని ఫిర్యాదులపైనా ఇరిగేషన్, హెచ్ ఎండీ ఏ మున్సిపాలిటీ అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ల ప్రతినిధులు, స్థానికులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో స్థానికులు ఊరట చెందారు. హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్ గారు, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య ఉన్నారు.






