ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం
హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ గురువారం హైదరాబాద్ లో చేపట్టిన ఛలో బస్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించారు. బస్ భవన్ వద్దకు భారీగా తరలి వచ్చారు గులాబీ శ్రేణులు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి , సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరో వైపు బస్ భవన్ లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు, పద్మా రావు గౌడ్ , తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్, హరీశ్ రావులు.
వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. మెట్రో రైలును ఆగం చేశాడని, ఆపై ఆర్టీసీని అమ్మేందుకు లోపాయికారిగా ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు వ్యవహరించడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణగా మారి పోయిందన్నారు. టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టిసి ఎండిని కలిసి వినతి పత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా అని నిలదీశారు. తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.






