ఉచితాలు కాదు కావాల్సింది విద్య, వైద్యం పై దృష్టి సారించాలి
అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన ఇటీవల తిరుమలను దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని సామాన్యులకు అందించేలా చూడాలన్నారు. ఇదే క్రమంలో ప్రముఖులు సంవత్సరానికి ఒకే సారి వచ్చేలా టీటీడీ పాలక మండలి, ఈవో ఆలోచించాలని బాంబు పేల్చారు. ఇదే సమయంలో తాజాగా ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు మాజీ ఉప రాష్ట్రపతి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు. ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ప్రధానంగా నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. లేక పోతే ఖజానా ఖాళీ అవుతుందని, జనం పని చేసేందుకు దూరమవుతారని పేర్కొన్నారు.
అంతే కాదు ప్రజా ప్రతినిధులు తమ భాషను సరి చేసుకోవాలని, ముఖ్యమంత్రి శాసన సభ, శాసన మండలిలో నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసలు స్పీకర్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాజకీయ లాభాలను సాధించడానికి ప్రభుత్వం ఉచితాలపై ఎక్కువగా ఆధార పడుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా చేపలు ఇవ్వడం కంటే చేపలు పట్టడం, తమను తాము ఎలా పోషించు కోవాలో నేర్పించాలని నాయుడు నొక్కి చెప్పారు . విద్య ప్రజలు తమ సొంత నిబంధనల ప్రకారం జీవనోపాధి పొందే అవకాశాలను సృష్టిస్తుంది, అయితే ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు.






