పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) విజయవాడ చాప్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు అనిత. మహిళలను వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మార్చే వేదికపై ప్రసంగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ కళాకారుల నుంచి డిజిటల్ నూతన ఆవిష్కరణల వరకు ప్రోత్సాహం ఇస్తూ మహిళలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ముఖాముఖిలో మహిళల రక్షణ, సైబర్ బులీయింగ్ పై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. FICCI మరియు స్థానిక మహిళా సంఘాల సహకారంతో మహిళల రక్షణ చర్యలు పెంచుతామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. 24 గంటలు పనిచేసేలా హెల్ప్ లైన్ తో పాటు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆన్ లైన్ వేదికలను మహిళలకు సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలను మహరాణులుగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు వంగలపూడి అనిత. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు, కుక్కర్లు అందచేశారు మంత్రి. వ్యాపారవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.






