ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇంకోసారి మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారని మండిపడ్డారు. చట్టం ప్రక్రియ పూర్తి కాకముందే జీఓ ఎలా తెచ్చారంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థలు నిర్వహించేందుకు భయపడే ఈ కొత్త నాటకానికి తెర లేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వి. శ్రీనివాస్ గౌడ్. రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బీసీలను బలి పెట్టి రోడ్లపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
స్టే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తూ వచ్చారని ఆవేదన చెందారు. మంత్రులు కోర్టులకు వెళ్లడానికి అది ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఆటనా అని ప్రశ్నించారు . బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందని కోర్టుకు ఏజీ స్పష్టంగా చెప్పారని అన్నారు. హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా.. ఆత్మ సాక్షిగా చెప్పాలని నిలదీశారు. బీసీల చెవిలో పువ్వులు పెడతామంటే ఎవరూ నమ్మరన్నారు. బీసీలను దివాళా చేయించాలని కుట్ర పన్నారని వాపోయారు వి. శ్రీనివాస్ గౌడ్. ఓసీ, బీసీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రోల్ మోడల్ అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఏమైందన్నారు. విజయవంతమైన తమిళనాడును అనుసరిస్తారా లేక విఫలమైన రాష్ట్రాలను అనుసరిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించాచరు వి. శ్రీనివాస్ గౌడ్.






