ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : ఈ దేశంలో దళితులు, బహుజనులు ఉన్నత పదవులలో నెలకొంటే తట్టుకోలేక పోతున్నారని, ఇందులో భాగంగానే దాడులకు తెగ బడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ని లక్ష్యంగా చేసుకుని న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసరడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యంగంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
ఇదిలా ఉండగా తనపై బూటుతో దాడి చేయడం పట్ల జస్టిస్ గవాయ్ స్పందించిన తీరు అత్యంత హుందాకరంగా, గౌరవనీయంగా ఉందన్నారు. ఇలాంటి దాడులు తమకు కొత్త కాదంటూనే కేసులను వాదించడం ఆయనకు చట్టం పట్ల, భారత ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్న ప్రేమను, నిబద్దతను తెలియ చేస్తుందన్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదని ధ్వజమెత్తారు. అందుకే ఈ దాడికి తెగ పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు మందకృష్ణ మాదిగ.






