12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
హైదరాబాద్ :హైదరాబాద్ లో పలు చోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. ఇక్కడ ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా..రంగారెడ్డి జిల్లాలో ప్రజావసరాలకు ఉద్దేశించిన 680 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.
షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లోని సర్వే నంబరు 403లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. దీని విలువ రూ. 750 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. లేని సర్వే నంబరు(403/52 )తో.. అన్ రిజిస్టర్డ్ సేల్‌డీడ్‌ను సృష్టించి ఈ భూమి తనదంటూ పార్థసారధి అనే వ్యక్తి కబ్జాకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తాగు నీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఇందులో 1.20 ఎకరాల భూమిని జలమండలికి ప్రభుత్వం ఇచ్చినా అక్కడ పనులు చేయకుండా అడ్డు కుంటున్నారనేది మరో ఫిర్యాదు. ఈ రెండు ఫిర్యాదులను హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని ఆక్రమణలను తొలగించింది.






