18న బీసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈనెల 18న నిర్వహించే బీసీ సంఘాల బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. బుధవారం తనను కలిశారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని కాంగ్రెస్ మాయ మాటలు చెబుతోందని మండిపడ్డారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని తాము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా ప్రశ్నిస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నాన్ని తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటామన్నారు. బీసీ డిక్లరేషన్ అమలులో విఫలం అయ్యారని, దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ తెచ్చిన 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకు వచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల కోసం కాదన్నారు. కాంట్రాక్టుల నుంచి మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42% వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.






