పంచాయతీ రిజర్వేషన్ల కేసు డిస్మిస్
ఢిల్లీ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు ఒప్పుకునేది లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. పాత రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా తో కూడిన ధర్మాసనం విచారించింది. బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ను సవాల్ చేస్తూ దావా దాఖలు చేసింది. ఈ సందర్బంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు ఏసింది. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా అని అడిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని వెల్లడించారు . శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించు కోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించా మన్నారు. గవర్నర్ బిల్లు పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారన్నారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామని తెలిపారు.






