రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
శ్రీ సత్యసాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెరలకు క్వారీ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లతో పాటు సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందన్నారు. వడ్డెరలను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి వెల్లడించారు.
వడ్డెరలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే విద్య తప్పనిసరి అని సవిత స్పష్టం చేశారు. తమ బిడ్డలను ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. వడ్డెర సామాజిక వర్గీయుల వినతి మేరకు తన తండ్రి పేరు మీద ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా సొంత నిధులతో గోరంట్ల మండల కేంద్రంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ సాహు, టీడీపీ సీనియర్ నాయకులు దేవళ్ల మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో వడ్డెర సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.






