స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత
కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాట కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్బంగా పలువురు వృత్తి నైపుణ్యం కలిగిన కళాకారులను కలుసుకున్నారు. వారి నైపుణ్యాన్ని దగ్గరుండి పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు నిర్వహించిన భూమిక ప్రశంసనీయమన్నారు. ఇదే సమయంలో బతుకమ్మతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చామన్నారు కల్వకుంట్ల కవిత. జనం బాటలో భాగంగా కళాకారులకు నెలవైన కరీంనగర్ జిల్లాలో కళాకారులను ప్రత్యక్షంగా కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు.
జాగృతి నుంచి అనేక మంది కళాకారులను గుర్తించే పని చేస్తున్నామని చెప్పారు. మురళీధర్ దేశ్ పాండే, గోపాల్ రావ్ ఆధ్వర్యంలో సమీకరిస్తున్నామని తెలిపారు. ఆ వారసత్వ కళాకారులను మనం గుర్తించి, వారికి సమున్నత స్థానం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా చేస్తామన్నారు. తద్వారా వారికి రాష్ట్ర ప్రభుత్వంతో కొంత వేతనం వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం వేతనం ఇచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఒగ్గు కథ చెప్పిన తమ్ముడు, డప్పుతో వచ్చిన మహిళ కళాకారులు, చిడతలతో వచ్చిన అన్నదమ్ములు, కోలాటం చేసిన అక్కాచెల్లెలు, లంబాడా మహిళ కళాకారులు అందరికీ కళాభి వందనాలు తెలియ చేశారు కవిత. ఇక మిగిలింది పోరాటం చేయడం మాత్రమేనని పేర్కొన్నారు.






