తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియ చేసేలా ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, గవర్నర్లు, ముఖ్యమైన ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ దిగ్గజాలు దాదాపు 5 వేల మందికి పైగా రావాలంటూ ప్రత్యేకంగా ఇన్విటేషన్లు పంపించినట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్.
ఇదిలా ఉండగా సమ్మిట్ లో పాల్గొనాలని స్వయంగా ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను తన నివాసంలో మర్యాద పూర్వకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలతో కలిశారు. ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కోరారు. అధికారిక ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం ముఖ్య నేతలు పార్టీ పరంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, శశి థరూర్ , తదితరులను కలిసి రావాలని కోరుతారు. ఇదే క్రమంలో దేశ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, స్పీకర్ , డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆహ్వానిస్తారు.






