వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఏలిన జగన్ రెడ్డి సర్కార్ రైతులను విస్మరించిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ బాస్ కే దక్కిందన్నారు. ఇదిలా ఉండగా చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తూ, ఇప్పటికే ఉన్న డ్రిప్‌లలోనూ ఆటోమేషన్ అమర్చుకునే వీలుందని చెప్పారు.
ఎంపానెల్ చేసిన కంపెనీల ద్వారానే పారదర్శక అమలు, స్థిర ధరలు, అధికారి తనిఖీ అనంతరమే చెల్లింపులు, ప్రతి భాగంపై “APMIP” ముద్ర తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వారంటీ, సర్వీస్ సపోర్ట్, త్వరితగతిన ఫిర్యాదు పరిష్కారం కల్పిస్తూ రైతును ఎప్పుడూ భరోసాగా నిలబెడతామని స్పష్టం చేశారు. నీటి, విద్యుత్, ఎరువుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగి, రైతు ఆదాయం స్థిరపడేలా ఆటోమేషన్ ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ సంస్కరణగా నిలుస్తుందని అన్నారు. స్మార్ట్ వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలబెడదామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.






