కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ
అమరావతి : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగ క్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా ఉండగా మారిషష్ అధ్యక్షుడితో భేటీ అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు 10 కోట్ల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తోందని చెప్పారు. వేలాదిగా తరలి రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాష అభివృద్దికి సర్కార్ మద్దతు ఇస్తుందన్నారు.






