త్వరలోనే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ
జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాధించే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ది పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్వారా రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా ఆయను తాను నిత్యం స్మరించే ఆంజనేయుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు గాను మరింత సౌకర్యవంతంగా ఉండేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు సీఎస్ రామకృష్ణా రావు.
దీంతో రంగంలోకి దిగారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గిరిప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు ,తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించారు. గిరిప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్ల కు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. ఇందుకు గాను దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి, పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, కొండగట్టు ఈ.వో శ్రీకాంత్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






