ఇప్పటికే నిషేధం విధించామని ప్రకటన
హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందన్నారు. ఎవరైనా ఉపయోగించినా లేదా రవాణా చేసినా వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అంతటా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు , ఆశ్చర్యకరమైన తనిఖీలు నిర్వహించ బడతాయని కమిషనర్ స్పష్టం చేశారు. చైనీస్ మాంజా అమ్మకందారులు, స్టాకిస్టులు, రవాణాదారులు, వినియోగదారులపై సంబంధిత చట్ట విభాగాల కింద కేసు నమోదు చేస్తామన్నారు. మంగళవారం వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
తల్లిదండ్రులు, సంరక్షకులకు విజ్ఞప్తి చేస్తూ పిల్లలు సాంప్రదాయ కాటన్ దారంతో మాత్రమే గాలిపటాలు ఎగుర వేయడానికి అనుమతించాలని సూచించారు. వేడుకల సమయంలో ప్రమాదకరమైన పదార్థాలను ఖచ్చితంగా నివారించాలని సజ్జనార్ కోరారు. చైనీస్ మాంజా ఒక ప్రాణాంతక పదార్థం, పండుగ బొమ్మ కాదు అని పేర్కొన్నారు సీపీ . చైనీస్ మాంజా చట్టవిరుద్ధంగా అమ్మకాలు లేదా నిల్వ చేయడంపై 100కు డయల్ చేయడం ద్వారా, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ (94906 16555)కు సంప్రదించడం ద్వారా లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియ జేయడం ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
బాధ్యతా యుతంగా వేడుకలు జరుపుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు, మానవ ప్రాణాలకు హాని కలిగించకుండా లేదా ప్రకృతికి హాని కలిగించకుండా పండుగలను ఆస్వాదించాలని కమిషనర్ అన్నారు






