తెలంగాణ సర్కార్ పై దాసోజు శ్రవణ్ కామెంట్స్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ పూర్వ వైభవానికి భంగం కలిగించేలా చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడపై ఫైర్ అయ్యారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన.. సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మీ ఇష్టానుసారం మార్చేసే హక్కు మీకు లేదని హెచ్చరించారు. మల్కాజిగిరి పేరుతో ఒక “ప్రత్యేక ఎం.సి.హెచ్” (Exclusive MCH) ఏర్పాటు చేసి, చారిత్రాత్మకమైన సికింద్రాబాద్ సరిహద్దులను బలవంతంగా మింగేయడం ఏకపక్షం, హాస్యాస్పదం అన్నారు.
అంతే కాదు మీ నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి . ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది అధికార దుర్వినియోగం అని మండిపడ్డారు. మితిమీరిన జోక్యం తగదన్నారు. తరతరాలుగా ప్రజలు ప్రేమించి, గర్వంగా బతికిన ఆ చారిత్రక మూలాలను దారుణంగా చెరిపేసే ప్రయత్నం తప్పా మరోటి కాదన్నారు. సికింద్రాబాద్ పేరును, సంస్కృతిని, దాని గుర్తింపును కాపాడాలి, గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. దాని ఉనికిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే.. ఇక్కడి ప్రజలే కాదు, చరిత్ర కూడా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఇక నుంచి సికింద్రాబాద్ జోలికి రావద్దని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు.






