మాజీ సీఎం జగన్ రెడ్డికి మతి భ్రమించింది
కడప జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఏకి పారేశారు. వ్యవసాయ రంగాన్ని పట్టించు కోలేదన్నారు. కానీ తాము వచ్చాక అన్నదాతలకు అండగా నిలబడ్డామని అన్నారు. రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. చిన్న రైతు,పెద్ద రైతు అన్న తేడా లేకుండా అందరికీ న్యాయం చేశామన్నారు. కోకో పొగాకు, మామిడి, మిర్చి రైతులకు ధరల వల్ల నష్టపోకుండా మద్ధతు ధర అందజేశామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతులుగా 46 లక్షలకు పైగా రైతులకు 6,310 కోట్లు అందజేశామన్నారు. కూటమి వ్యవసాయం యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రోత్సాహమిస్తోందని వెల్లడించారు. సర్వారాయ సాగర్ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సీఎం చంద్రబాబు సుముఖతతో ఉన్నారని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నామని అన్నారు ఎస్. సవిత. అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. జగన్ రెడ్డి మానసిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని, ఆయనకు లండన్ మందులు పని చేయనట్లుందని, ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమలో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు తానే నిర్మించానని, విశాఖకు డెటా సెంటర్ ను కూడా తెచ్చింది ఆయనేనని జగన్ చెప్పుకోవడం ఆయన దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.






