నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని, ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత YCP ప్రభుత్వం 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందంటూ మండిపడ్డారు.
2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి. ఈ రెండేళ్ల కాలంలో ఎంత మందికి జాబ్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. ఇందుకు సంబంధించి వివరాలు చెప్పాలన్నారు.
ఇదిగో అదిగో అని ఊరించడం తప్పా ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది అంటూ నిలదీశారు షర్మిలా రెడ్డి.
కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు..జోక్ క్యాలెండర్ అంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అంటూ మండిపడ్డారు . జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆ సోయి సీఎంకు, సర్కార్ కు లేకుండా పోయిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని అన్నారు. ఉన్నది అమ్ముకుని సైతం కోచింగులు తీసుకుంటున్నారని, అయినా సర్కార్ స్పందించక పోవడం పట్ల ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఇస్తారా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నారంటూ వాపోయారు.






