ఎలాంటి అదనపు ఛార్జీలంటూ ఉండవు
విజయవాడ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఖుష్ కబర్ చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు . విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిద వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రయాణీలకు ఈసారి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ స్త్రీ శక్తి పథకం కింద డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసులను సమన్వయం చేస్తోందని చెప్పారు. ప్రత్యేక బస్సులలో దాదాపు 71% రాష్ట్ర అంతర్గత కార్యకలాపాల కోసం కేటాయించినట్లు తెలిపారు. సుమారు 6,000 బస్సులు పండుగ సమయంలో సాంప్రదాయకంగా రద్దీ ఎక్కువగా ఉండే గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు ఎండీ.
అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైతో సహా కీలక గమ్యస్థానాలకు 2,432 ప్రత్యేక బస్సులను నడుపుతుందని చెప్పారు, ఇవి సంక్రాంతికి ఇంటికి తిరిగి వచ్చే వలస కార్మికులు, విద్యార్థులు, కుటుంబాలకు సేవలు అందిస్తాయన్నారు. పండుగకు ముందు రద్దీని తగ్గించడానికి, సంస్థ 3,857 ప్రత్యేక సర్వీసులను షెడ్యూల్ చేసిందన్నారు. వీటిలో, 3,500 బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోపల నడుస్తాయని చెప్పారు ద్వారకా తిరుమల రావు. అయితే 240 సర్వీసులు హైదరాబాద్ నుండి, 102 బెంగళూరు నుండి ,15 చెన్నై నుండి బయలు దేరతాయని తెలిపారు.






