రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిర్వాకంపై , వ్యక్తిగతంగా తన తండ్రి కేసీఆర్ గురించి నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు ఇక్కడ చెల్లవన్నారు. నిజమైన మొగోడు కాబట్టే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చాడని అన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో ఏపీకి వంత పాడిన నీకు తమ గురించి, తమ ఫ్యామిలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పటాకులు పేలినట్టు.. చెక్‌డ్యామ్‌లు పేలుతున్నా కండ్లప్పగించి చూస్తున్న రేవంత్‌రెడ్డి మనకు నీళ్ల గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి నీళ్ల గురించి ఏం తెలుసంటూ ఎద్దేవా చేశారు. 65 ఏండ్లు తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెసోళ్ల తరఫున వకల్తా పుచ్చు కోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆయన చెప్తే మనం వినాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెసోళ్లను నమ్మిన పాపానికి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం చలికాలంలో రాత్రనకా పగలనకా లైన్లు కట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. మధ్యాహ్నం తిండికి పోవాల్నంటే చెప్పులు పెట్టి, రాళ్లు పెట్టి, రాళ్లకింద ఆధార్ కార్డులు పెట్టి దేవుడికి దండం పెట్టాల్సిన దౌర్భ్యాగ్యం నెలకొందన్నారు కేటీఆర్. .‘నేను వచ్చేదాకా నా జాగ కాపాడుస్వామీ’ అని మొక్కుకోవాల్సిన పరిస్థితి ఉన్నదంటూ వాపోయారు. నాలుగు కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి తీరును ఒప్పుకోరని అన్నారు.






