ఆయనకు అంత సీన్ లేదని ఫైర్
ఖమ్మం జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రధానంగా ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కమీషన్లపైన ఉన్నంత శ్రద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై లేకుండా పోయిందన్నారు కేటీఆర్. ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఇచ్చిన హామీల సంగతి ఏమిటో చెప్పాలన్నారు. మంత్రి పొంగులేటి దీపావళికి బాంబులు పేలుతాయని అన్నాడు.. రెండు దీపావళిలు పోయాయి కానీ బాంబులు మాత్రం పేలలేదంటూ ఎద్దేవా చేశారు. మంత్రులకు ప్రత్యేకించి పొంగులేటికి అంత సీన్ లేదన్నారు.
ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ అయితే మోదీ, అదానీ కాళ్ళు పట్టుకొని కేసు అవ్వకుండా బీజేపీకి మోకరిల్లాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఇంకో మంత్రి తుమ్మల నేను వస్తున్నా అని కార్పొరేటర్ల ఇండ్లు తిరిగి ముగ్గురిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయాడని ఫైర్ అయ్యారు. ప్రజలు అనుకుంటే ఎంతమంది కార్పొరేటర్లను ఎత్తుకొని పోయినా తుమ్మల పీకేది ఏం ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతమంది కార్పొరేటర్లు పోయినా, యువతకు అవకాశం ఇచ్చి కొత్త నాయకులను తయారు చేస్తామని ప్రకటించారు కేటీఆర్.






