అందుకే అన్ని బంధనాలను తెంచుకున్నా
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానంగా తన తండ్రి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో ఇసుమంత కూడా గౌరవం దక్కలేదని వాపోయారు. వేలాదిగా పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకు రాకపోవటం విచారకరం అన్నారు కవిత. ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పనిచేస్తే వారికి అవకాశాలే రాలేదని వాపోయారు. ఒకరిద్దరూ నా లాంటి వాళ్లకు మాత్రమే అవకాశం వచ్చిందని చెప్పారు. కానీ నన్ను కూడా చిత్రహింసలు, నానా అవమానాలకు గురి చేసి రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపించారు. అలా చేసి ఆ పార్టీ ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తొమ్మిదిన్నరేళ్లలో 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 12 లక్షల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. ఒక్క ఇరిగేషన్ కోసమే లక్షా 89 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని అన్నారు. కానీ పేద ప్రజలకు మాత్రం ఇళ్లు ఎందుకు ఇవ్వలేక పోయారో చెప్పాలని నిలదీశారు .కొంతవరకు మంచి జరిగింది. కానీ ఇది పర్మినెంట్ గా ఉండేలా చేయలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక పెద్ద ఎత్తున మంచి జరుగుతుందని ఇంకా ఎంతో చేస్తారని ప్రజలకు ఆశలు పడ్డారని చెప్పారు. కానీ వారి ఆశలు అడియాశలుగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఉద్యమకారులు తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి గౌరవించాలని ఆశిస్తే అది కూడా చేయలేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా మహిళలను, నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.






