ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు
గుంటూరు జిల్లా : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రైతులకు తీపి కబురు చెప్పారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి మార్కెట్ యార్డులకు వస్తోందని, స్థానిక రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా లావాదేవీలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కొంతమంది రైతులు మిర్చి నుంచి మొక్కజొన్న సాగుకు మళ్లారనిపేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు సరైన ధరలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి ధరలను బట్టి పంటలను పండించేలా ఒక క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని వెల్లడించారు.
వీటిపై రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు అదికారులు చేపట్టాలని సూచించారు. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలను పూర్తిగా రికార్డు చేస్తున్నామని, నూటికి నూరు శాతం ఇ–క్రాప్ నమోదు జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే నల్లి తామర వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కంప్యూటర్ వెయిట్ మిషన్ లు ప్రస్తుతం 100 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వాటి సంఖ్యను మరింత పెంచేలా వెంటనే చర్యలు చేపట్టాలనిమంత్రి ఆదేశించారు. రైతులకు తప్పనిసరగా రసీదులు అందచేయాలని, చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణాకు ధర నిర్ణయించడం జరుగుతుందని, అంతకంటే తక్కువ ధరకు వచ్చిన వారిని అడ్డుకోవద్దని కోరారు. కోల్డ్ స్టోరేజ్ లలో ఉన్న సరుకు కూడా మిర్చి యార్డుకు రావాలని ఆయన స్పష్టం చేశారు.






