మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన
సూర్యాపేట జిల్లా : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన సూర్యాపేటలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. హుజూర్ నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలన్నారు. ఎప్పటికప్పుడు పురోగతిని పరిశీలించి నిర్దేశించిన సమయం లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మిగిలి పోయిన పనుల పూర్తికి అవసరమైన అంచనాలను రూపొందించి పంపిస్తే ఈ నెల 15లోగా అనుమతులు మంజూరు మంజూరు చేస్తామన్నారు. అవసరమైతే పనులను విభజించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రాజకీయాల కతీతంగా కులం, మతం, వర్గం పేరు అడగకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు వెచ్చించి ఇండ్లు కట్టిస్తున్నాం అన్నారు, ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నాం అని వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు, అలాగే గతంలో గృహ జ్యోతి కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలని అన్నారు. వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆలోచించింది తప్ప పేదవాడికి ఇండ్లు కట్టించ లేదన్నారు. అంతేకాక గృహ నిర్మాణ శాఖను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు.






