సంచలన ప్రకటన చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్
ముస్సోరి : హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావడం, అధికారాలు కట్ట పెట్టడం తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఆవిష్కృతమైంది ఈ సంస్థ అని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో కొత్తకోణాన్ని ఆవిష్కరించిందన్నారు. కాలుష్యం కారణంగా క్లౌడ్ బరస్ట్‌లు సర్వ సాధారణంగా మారిపోయిన వేళ.. వరదలకు ఆస్కారం ఉండే అంశాలపై హైడ్రా దృష్టి పెట్టిందని చెప్పారు. నగరాల్లో ఉండే చెరువులు, నాలాలను పునరుద్ధరించి.. ప్రకృతి చికిత్స హైడ్రా చేస్తోందన్నారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే నాలాలను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ఈ రెండు చర్యలతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు వరద ముప్పును తగ్గించామన్నారు. హైడ్రాను తీసుకువచ్చిన ప్రభుత్వంపైన, హైడ్రా పైనా అనేక విమర్శలు చేసిన రాజకీయ పార్టీలు తర్వాత కొనియాడడం మొదలు పెట్టాయని చెప్పారు రంగనాథ్.
కబ్జాదారులు, ఆక్రమణదారులు హైడ్రాపై బురదజల్లే కార్యక్రమాలను చేపట్టినా.. ప్రజలు వాటిని తిప్పి కొట్టారని అన్నారు. హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ ముందు చూపునకు జై కొట్టారని చెప్పారు కమిషనర్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా కార్యకలాపాలను వివరించారు.
వివిధ స్థాయిల సీనియర్ అధికారులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. కొన్ని సార్లు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. హైడ్రా చర్యలవల్ల ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది..? , బడా బాబుల భూ కబ్జాలను తొలగించినప్పుడు ఉండే ఒత్తిళ్లపై ఆరాతీశారు. ఇలా అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. హైడ్రా సుమారు 1,313.19 ఎకరాల ఆక్రమిత భూములను (చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు) స్వాధీనం చేసుకుందని ప్రకటించారు.
వీటి విలువ సుమారు రూ. 65,650 కోట్లు ఉంటుందని అంచనా అని చెప్పారు రంగనాథ్.






