ప్రకటించిన ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి
హైదరాబాద్ : ఓ వైపు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసం భారీ ఎత్తున బస్సులను నడిపిస్తామని సంచలన ప్రకటన చేసింది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి అత్యధికంగా ఏపీకి వెళతారు. దీంతో ఈసారి వారిపై ఎలాంటి భారం వేయబోమంటూ సంచలన ప్రకటన చేశారు ఎండీ ద్వారకా తిరుమల రావు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ నాగిరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 6,400 కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రధాన బస్ స్టేషన్ల నుండి ఎంపిక చేసిన తేదీలలో ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని తెలిపారు.
ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9, 10, 12, 13, 18 మరియు 19 తేదీలలో నడపబడతాయి. ఈ ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నట్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ బస్సులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) , జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్ల నుండి, అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్స్, ఆరామ్‌ఘర్, ఎల్బీ నగర్, బోవెన్‌పల్లి, కేపీహెచ్‌బీ , గచ్చిబౌలితో సహా ఇతర ముఖ్య ప్రదేశాల నుండి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏకంగా 50 శాతం పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణీకులు. నిలువు దోపిడీ నుంచి రక్షించాలని కోరుతున్నారు.






