నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో రెండేళ్లకే పాలనా పరంగా ప్రజలు కాంగ్రెస్ ను చీదరించు కుంటున్నారని ఆరోపించారు. చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒకటే ఉంటుందన్నారు కేటీఆర్. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పాలమూరును పట్టించు కోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రి తోని మాకు నీటి పాఠాలు చెప్పించు కోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. నదుల గురించి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నీటి పాఠాలు చెప్తా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రేపు రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలని అన్నారు.






