మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రశంస
హైదరాబాద్ : మేడారం జాతర సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ ను తన నివాసంలో కలవడం జరిగిందని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఈ సందర్బంగా స్వయంగా ఆహ్వాన పత్రికను కేసీఆర్ నివాసంలో అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ స్వంత సోదరీమణులుగా సాదర స్వాగతం పలికారని చెప్పారు. వారు ఆప్యాయంగా మాట్లాడారని, చీరలు, బొట్టు కూడా ఇచ్చారని చెప్పారు. రాజకీయాలు వేరు ఇది వేరని అన్నారు సీతక్క, కొండా సురేఖ.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేసినట్లు చెప్పారు. అయితే కేసీఆర్ ని కలుసు కోలేక పోయామన్నారు. దీంతో వ్యక్తిగతంగా అధికారికంగా ప్రభుత్వం తరపున ఆహ్వానం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రస్తావనలు రాలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మేడారం జాతర జరుగుతుందన్నారు. ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు కొండా సురేఖ, సీతక్క. ఆదివాసి బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అని చెప్పారు. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారాలమ్మలు అని తెలిపారు. తల్లుల బంగారాన్ని, బట్టలను కెసిఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావలసిందిగా కోరామన్నారు.






