నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్
పిఠాపురం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు అని అన్నారు. ముఖ్యమంత్రి అయినా, లేక తాను అయినా తప్పు చేస్తే శిక్షించే పరిస్థితులు ఉండాలని అసెంబ్లీలో చెప్పాం అన్నారు. నన్ను ఒక మాట అన్నా పడతాను, పార్టీని దూషించినా భరిస్తాను.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం ఉపేక్షించను అని స్పష్టం చేశారు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అన్నారు. నా మాటలు మెత్తగా ఉంటాయి.. కానీ చాలా గట్టిగా తీసుకుంటానని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.50 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం అని అన్నారు.
ఇందుకు గానూ ప్రతి నెల రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పారు. ఎక్కడా హడావుడి లేకుండా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. దీని కోసం గత ప్రభుత్వం మాదిరి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయలేదని అన్నారు. మగ్గాలపై పని చేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం అని వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద 62.27 లక్షల మందికి లబ్ధిని చేకూర్చామని తెలిపారు. గత ప్రభుత్వం నాసికరం మద్యం అమ్మకాలతో రూ. 23 వేల కోట్లు దోచుకుంటే .. మా ప్రభుత్వం ఆ దోపిడీని అరికట్టి రూ. 10 వేల కోట్లు తల్లికి వందనం పథకానికి ఖర్చు చేశాం అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకూ 4 కోట్ల భోజనాలు అందించామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున 2.90 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 436 కోట్లు వారి ఖాతాల్లో వేశాం అన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే … కూటమి పాలనలో కేంద్రాన్ని మళ్ళీ ఒప్పించి రూ. 24 వేల కోట్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించామని చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అని అన్నారు. ఆయనకు నా మధ్య ఎలాంటి అరమరికలు, విభేదాలు లేవు. పొత్తులను బలహీన పరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు అని అన్నారు.






