మరింతగా ఎదగాలని పిలుపునిచ్చిన జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్ : ఈ దేశంలో అపారమైన మానవ సంపద ఉందని, దానిని ఉపయోగించు కునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. బిట్స్ పిలానీ ఆధ్వర్యంలో నిర్వహించచిన అలుమిని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్ ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ , నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో వివరించారు.
సదస్సు మొదటి రోజున ‘పిలానీ షార్క్స్’ (Pilani Sharks) కార్యక్రమం ద్వారా స్టార్టప్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సెషన్ లో పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని కొత్త స్టార్టప్‌లు తమ వ్యాపార నమూనాలను అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించే అవకాశం లభించింది. దీనికి సమాంతరంగా, ‘ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI) , ‘డిజిటల్ వెల్నెస్’ (Digital Wellness) అంశాలపై సాంకేతిక వర్క్‌షాప్‌లు జరిగాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, మానవ కేంద్రిత రూపకల్పన మధ్య ఉన్న సంబంధంపై దృష్టి సారించాయి.
బీజీఎం 2026 ఛైర్ పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని పేర్కొన్నారు. మొదటి రోజు ముగింపులో ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని ,స్నేహాన్ని చాటిచెప్పే సంప్రదాయ ‘ఖవ్వాలీ’ ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.






