ఏపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కీలక సూచన
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సర్కార్ ను ఉద్దేశించి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నీళ్ల వివాదాలకు సంబంధించి పదే పదే అడ్డంకులు సృష్టించడం వల్ల తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం ఆగి పోయాయని వాపోయారు. దీని కారణంగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు సీఎం. ఇది మంచి పద్దతి కాదన్నారు. కూర్చుని చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఏపీ సర్కార్ తో తాము సత్ సంబంధాలు నెలకొల్పేందుకు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. దీని కారణంగా పనులు ఆలస్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కావాలని పక్క రాష్ట్రాలతో గిల్లి కజ్జాలకు దిగాలని కోరుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. అది ఏపీ అయినా.. కర్ణాటక అయినా.. తమిళనాడు అయినా.. మహారాష్ట్ర అయినా, పరస్పర సహకారమే కోరుకుంటున్నాం అని స్పష్టం చేశారు. ఇకనైనా ఏపీ సర్కార్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.






