దిశా నిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ తరఫున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాల పార్టీ బాధ్యులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేసే విధానంపై దిశా నిర్దేశం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమై, వారికి భరోసాగా నిలిచినప్పుడే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని స్పష్టం చేశారు. గతంలో కంటే మరింత గొప్పగా వారి మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
ఈసారి ఇప్పటి వరకు గెలిచిన సీట్లే కాకుండా మరికొన్ని సీట్లు అదనంగా కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్లో పని చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన జగన్ మోహన్ రెడ్డి వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. భారీ ఎత్తున అప్పులు మిగిలించి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.






