హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాం
కరీంనగర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరిధులలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న హుస్నాబాద్ ను తిరిగి కరీంనగర్ జిల్లా పరిధిలో తీసుకు రావడం ఖాయమని స్పష్టం చేశారు పొన్నం. సిద్దిపేట జిల్లా పరిధి తగ్గుతుందా, అసలు సిద్దిపేట జిల్లా అలాగే ఉంటుందా మారుస్తారా.. హుస్నాబాద్ మండలాన్ని మార్చిన పక్షంలో ఇతర జిల్లాల పరిధిలోని ప్రాంతాలను సిద్దిపేటలో కలుపుతారో లేదో తెలియాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నపుడు సిద్ధిపేట జిల్లా కోసం జనగామ ను జిల్లా కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన హరీష్ రావు.. ఇపుడు సిద్దిపేట జిల్లాను కాపాడు కోవడానికి తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో చివరి విస్తరణలో జనగామను జిల్లా చేయడానికి కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలు బలంగా ఉండాలంటే.. జనగామను జిల్లా చేయకూడదని వ్యూహాత్మకంగా అడ్డుకున్న హరీష్ కు తాజా పరిణామాలు మింగుడు పడని విషయమేనని పేర్కొన్నారు. మరో వైపు గత ఎన్నికల సందర్భంగా ఆనాడు టీపీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్.






