ఘనంగా నివాళులు అర్పించిన పోలీసులు
చిత్తూరు జిల్లా : వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా పోలీసులు. రేనాటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ దేవదాస్ జిల్లా సాయుధ దళం కార్యాలయములో ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వడ్డే ఓబన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు అని పేర్కొన్నారు. జీవితంలోను, పోరాటంలోను, మరణంలోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న . నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఓబన్న జనవరి 11న జన్మించారు.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం అంటారని, కానీ అంతకు ముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని తెలిపారు. శిస్తుల వసూలు విషయంలో ఈస్టిండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్ళకు మధ్య మొదలైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి. ఆ పోరులో సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారు. 10 వేల మందితో వడ్డెరలు, బోయలు, చెంచులతో సంచార తెగల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారని అన్నారు.
అలాగే వడ్డే ఓబన్న ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠ, ప్రజల పట్ల సేవాభావం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీసు సిబ్బందికి ఆదర్శ ప్రాయమని అన్నారు. చట్ట పరిరక్షణ, ప్రజాసేవ, న్యాయం కోసం పనిచేసే ప్రతి పోలీసు కూడా వడ్డే ఓబన్నని స్ఫూర్తిగా తీసుకొని కర్తవ్య నిర్వహణలో మరింత అంకితభావం చూపాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు.






