నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం
హైదరాబాద్ : ఒక బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంటర్టైనర్ ఛానల్ అత్యంత జుగుస్సాకరంగా , వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. ఆయన అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. మహిళ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేలా కథనాలు ప్రసారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ ప్రశ్నించారు.
తక్షణమే ఇలాంటి చవకబారు, నీతి మాలిన కథనాలను టెలికాస్ట్ చేసినందుకు గాను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జయేష్ రంజన్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేక పోతే చట్ట పరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్రధానంగా మీడియా సంస్థలు బాధ్యతగా మెలగాలి తప్ప బరి తెగించవద్దని హితవు పలికారు సీనియర్ అధికారి, కార్యదర్శి. ఈ మేరకు మీడియాకు లేఖ విడుదల చేశారు అసోసియేషన్ సెక్రటరీ జయేష్ రంజన్.






