రూ. 5 కోట్ల బకాయిలు విడుదల ఖాతాల్లో జమ
అమరావతి : ఏపీ సర్కార్ సంక్రాంతి శుభ వేళ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు చేనేతన్నలకు రావాల్సిన బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఇందులో భాగంగా రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు. సోమవారం నేతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేశామని తెలిపారు. తమ సర్కార్ నేతన్నల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల పెంపుదలకు కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్ తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
ముఖ్యంగా ఈ కామర్స్ లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జియో మార్ట్, ఓఎన్డీసీ ద్వారా ఆన్ లైన్ లో చేనేత దుస్తుల అమ్మకాలను ప్రారంభించామన్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేయించి, ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ అమ్మకాలు చేస్తున్నామన్నారు మంత్రి సవిత . నేతన్నలకు రెడీమేడ్ దుస్తుల తయారీపై శిక్షణ సైతం అందజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత అమ్మకాలు ఊపందుకున్నాయని సవిత తెలిపారు. సంక్రాంతి ముంగిట రూ.5 కోట్ల బకాయిల చెల్లింపు చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.






