సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ : కర్ణాటక లో రాజకీయం మరింత వేడిని రాజేసింది. నువ్వా నేనా అంటూ సీఎం పదవి కోసం పంచాయతీ కొనసాగుతోంది సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ . ఈ తరుణంలో ఉన్నట్టుండి సీఎం పదవి మార్పు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. అవసరమైతే సిద్ధరామయ్య, శివకుమార్‌లను చర్చలకు పిలుస్తాం అని అన్నారు. మరో వైపు డీకే శివకుమార్ మాట్లాడుతూ తన కఠోర శ్రమ తనను రాజకీయాల్లో ఇంత దూరం తీసుకువచ్చిందని, తన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే భవిష్యత్ నిర్ణయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇటీవల దేవరాజ్ ఉర్స్ నెలకొల్పిన రికార్డును అధిగమించి రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచిన సిద్ధరామయ్య, తాను పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చర్చల కోసం ఢిల్లీకి ఎప్పుడు పిలుస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అవసరమైనప్పుడల్లా పార్టీ వారిని పిలుస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో నాయకత్వ పోరు తీవ్రమైంది. 2023లో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో సిద్ధరామయ్య , శివకుమార్‌ల మధ్య కుదిరినట్లు చెబుతున్న “అధికార పంపకాల” ఒప్పందం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.






