సంచలన ఆరోపణలు చేసిన జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. గురువు చంద్రబాబు నాయుడుకు మేలు చేకూర్చేలా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. చంద్ర బాబు నాయుడుకు సమయం ఇచ్చేందుకు తప్పుడు పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారని ఫైర్ అయ్యారు. హంగు ఆర్భాటంగా సుప్రింకోర్టుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బయటకు వచ్చే ముందు మొహం చూయించకుండా వెళ్ళిపోయాడని ఎద్దేవా చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పాలన సాగిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ చర్చ చెయ్యకుండా కోర్టుకు వేళా వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
చంద్ర బాబు నాయుడు డైరెక్షన్ లో పిటిషన్, డ్రాఫ్ట్ తయారు చేశారని ఆరోపించారు జగదీశ్ రెడ్డి. చంద్ర బాబు నాయుడుకు చెవిలో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు అని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మరి బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ రెడ్డి చేసేందుకే సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి పంపించాడని ధ్వజమెత్తారు. అయినా సోయి లేని మంత్రి ఉన్నా లేకున్నా ఒక్కటేనని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనుమతి పై ఢిల్లీకి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. కేసీఆర్ అనవసరంగా ఢిల్లీతో పంచాయతీ పెట్టుకున్నాడు అని రేవంత్ రెడ్డి కోతలు కోశాడన్నాడు.






